బాలల సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేసే విద్య అందించాలనే లక్ష్యంతో నాలుగు దశాబ్ధాల క్రితం ఉదయించిన సంస్థ ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ ఎకాడమీ’. పిల్లల లోని ప్రజ్ఞా పాటవాలను, అభిరుచులను గుర్తించి సృజనాత్మకతకు మెరుగులు దిద్దటమే ఎకాడమీ ధ్యేయం. ఆధునిక విజ్ఞానం, లోక జ్ఞానాన్ని పిల్లల్లో విస్తరింపచేయడానికి కృషి చేస్తోంది. అద్భుత విజ్ఞాన ప్రపంచం లోకి ద్వారాలను తెరుస్తూ ఎకాడమీ ‘బాల చెలిమి’ మాస పత్రికను బాలలకు అందించనుంది.
పిల్లలను జోకొడుతూ, వాళ్లని నిద్ర పుచ్చడానికి కథలు చెప్పే సాంప్రదాయం మనకు అనాదిగా ఉంది. వాళ్ల గుండె తలుపు తట్టి వాళ్లను మేల్కొలపడానికి కథలు చెప్పే అవసరం నేడు మన ముందు ఉంది. ఆ గురుతర బాధ్యతను ‘బాల చెలిమి’ తీసుకొంటోంది.